వేటలో అసాధారణ ప్రతిభ కలిగిన పక్షులు ఇవి. లక్ష్యాన్ని ఎంచుకునే తీరు, దానిపై దూసుకెళ్లే వేగం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ అద్భుతమైన సామర్థ్యమే ఇప్పుడు వీటికి భారత సైన్యంలో ప్రత్యేక స్థానం కల్పించింది. శత్రుదేశాల నుంచి వచ్చే డ్రోన్లను కూల్చివేయాల్సిన కీలక బాధ్యతను ఈ పక్షులకే అప్పగించారు. ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్య పథ్‌పై పరేడ్‌లో దర్శనమిచ్చి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన ఈ ‘పక్షి సైనికుల’ కథ నిజంగా ఆసక్తికరమైనది.
భారతదేశానికి చొరబాట్లు కొత్త విషయం కాదు. దాదాపు పది వేల కిలోమీటర్ల మేర విస్తరించిన సరిహద్దుల్ని మన సైనికులు అప్రమత్తంగా కాపాడుతున్నప్పటికీ అక్రమ కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొంతకాలంగా శత్రువులు డ్రోన్లను వినియోగించి మాదకద్రవ్యాలు, నకిలీ కరెన్సీ, ఆయుధాలను తరలిస్తున్నారు. ఇవి చిన్న పరిమాణంలో ఉండటంతో రాడార్ వ్యవస్థలను తప్పించుకుని లోపలికి చొచ్చుకొస్తున్నాయి. ఈ ప్రమాదాన్ని అడ్డుకునేందుకు భారత్ అత్యాధునిక సాంకేతిక పరికరాలను అభివృద్ధి చేస్తూనే, ప్రకృతి ఇచ్చిన శక్తివంతమైన ఆయుధాలను కూడా వినియోగించుకోవాలని నిర్ణయించింది.
అవే… గద్దలు.
ఈ ఉద్దేశంతోనే సుమారు 15 నల్లగద్దలు, గరుడ పక్షులు, ఫాల్కన్లను ఆరు సంవత్సరాల పాటు కఠిన శిక్షణతో తీర్చిదిద్దారు. ఉత్తరాఖండ్‌లోని ఔలిలో జరిగిన భారత్–అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల్లో ఈ శిక్షణ పొందిన పక్షులను తొలిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. శత్రు డ్రోన్ కనిపించగానే క్షణాల్లో దానిపై దాడి చేసి నేలకూల్చిన తీరు అక్కడి వీక్షకులను విస్మయానికి గురి చేసింది. ముఖ్యంగా కరణ్, అర్జున్ అనే రెండు నల్లగద్దలు ఇప్పటికే వందల సంఖ్యలో డ్రోన్లను నిర్వీర్యం చేశాయని సమాచారం. అంతేకాదు, తలపై చిన్న కెమెరాలు అమర్చి సరిహద్దుల్లో గస్తీ కూడా నిర్వహిస్తున్నాయి. ఈ సేవలకుగాను ఈ ఏడాది గణతంత్ర వేడుకల పరేడ్‌లో పాల్గొనే అరుదైన గౌరవం వీటికి లభించింది.
యూరప్ నుంచి ప్రేరణ
యుద్ధాల్లో పక్షుల వినియోగం కొత్త కాదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్, అమెరికా వంటి దేశాలు సమాచార రవాణా కోసం పావురాలను ఉపయోగించాయి. అప్పట్లోనే శత్రు పావురాలను అడ్డుకునేందుకు జర్మనీ గద్దలను ప్రయోగించింది. ఆ తరువాత ఈ విధానం కొంతకాలం మరుగున పడినా, డ్రోన్ల ముప్పు పెరిగిన నేపథ్యంలో మళ్లీ ప్రాధాన్యం సంతరించుకుంది. 2016లో నెదర్లాండ్స్ పోలీసులు వీఐపీ భద్రత కోసం ఈ పద్ధతిని అమలు చేశారు. ఫ్రాన్స్ వైమానిక దళం, తెలంగాణ పోలీసుల ‘గరుడ ఫోర్స్’ కూడా ఇదే దారిని అనుసరించాయి. భారత సైన్యం 2020 నుంచి ఫాల్కన్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నల్లగద్దలు, ఈగిల్స్, ఫాల్కన్లకు రీమౌంట్ వెటర్నరీ కోర్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
వీటినే ఎందుకు ఎంచుకున్నారు?
ఈ పక్షులు నేరుగా లక్ష్యాన్ని ఢీకొట్టవు. అలా చేస్తే ప్రమాదమని వాటికి సహజంగానే తెలుసు. అందుకే డ్రోన్ రెక్కలు, ప్రొపెల్లర్లను పక్క నుంచి దెబ్బతీసి కూల్చేస్తాయి. వీటి చూపు అత్యంత నిశితమైనది — ఆధునిక కెమెరాలకు సైతం పోటీ ఇచ్చే స్థాయిలో ఉంటుంది. అందుకే డ్రోన్లను గుర్తించి నిర్వీర్యం చేయడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
రెండు కిలోల కంటే తక్కువ బరువున్న డ్రోన్లపై మాత్రమే వీటిని ప్రయోగిస్తారు. కాళ్లకు ప్రత్యేక లెదర్ కవచాలు వేసి భద్రత కల్పిస్తున్నారు. ఇప్పటివరకు వందల డ్రోన్లను కూల్చినప్పటికీ ఒక్క పక్షికీ గాయాలు కాకపోవడం విశేషం. ఒక్కో పక్షి శిక్షణ, సంరక్షణకు సంవత్సరానికి సుమారు ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చవుతోంది. అయితే కోట్ల రూపాయలు వెచ్చించి తయారు చేసే డిఫెన్స్ డ్రోన్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ ఖర్చే.
హోదా కూడా ఉంది!
ఈ పక్షులకు భారత సైన్యంలో పోలీసు జాగిలాల స్థాయి హోదాను కల్పించారు. ‘సేనా మెడల్’ గ్రహీత లాన్స్ నాయక్ రాజేశ్ కుమార్ వీటి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కరణ్, అర్జున్‌తో కలిపి మొత్తం ఈ బృందాన్ని ‘అర్జున్ ఈగిల్స్’ అని పిలుస్తారు. ప్రకృతి శక్తిని సైనిక వ్యూహంగా మలిచిన ఈ పక్షి సైనికుల కథ నిజంగా గర్వకారణం.
