సంగతి, హైదరాబాద్: చైన్ స్నాచింగ్లు పెరిగిపోయాయని తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరబాద్ పోలీసు కమిషనర్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరు కూడా ప్రజలను భయపెట్టే పోస్టులను పెట్టొద్దని స్పష్టం చేశారు. బంగారం రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో స్నాచింగ్ చేసేందుకు పొరుగు రాష్ట్రాలనుంచి దొంగలు మకాం వేశారని వదంతులు రావడంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయనేమన్నారంటే..
“బంగారం రేట్లు పెరగడంతో చైన్ స్నాచింగ్లు విపరీతంగా పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్లో మకాం వేశాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. దయచేసి సోషల్ మీడియాలో వచ్చే ధృవీకరించని వార్తలను, భయపెట్టే పోస్టులను ఫార్వార్డ్ చేయకండి. భయాందోళనలు సృష్టించేలా అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్ నగరం పూర్తిగా సురక్షితం. శాంతిభద్రతల పరిరక్షణలో మాకు సహకరించండి. ఏదైనా అనుమానం వస్తే డయల్ 100కు కాల్ చేయండి.
నిశ్చింతగా ఉండండి. మీ భద్రతే మా బాధ్యత!!” అని రాసుకొచ్చారు.
