టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
సంగతి, న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో తాము ‘బాబ్రీ మసీదు’ నిర్మిస్తామని ప్రకటించారు. తమ నిర్మాణాన్ని ఏ అధికార, రాజకీయ శక్తి అడ్డుకోలేదన్నారు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ “ఇది అయోధ్య కాదు. ఇది ముర్షిదాబాద్. ఇది నా సవాలు. ఇక్కడ బాబ్రీ మసీదును ఎవ్వరూ తాకలేరు” అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చారని, అలాగే 2019లో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కోర్టు తీర్పును తాను గౌరవిస్తానని, ఆ తీర్పే మసీదును మరోచోట నిర్మించాలనే ఆలోచనకు దారి తీసిందన్నారు.
“నాకు బాబర్‌తో ఎలాంటి సంబంధం లేదు. కానీ బాబ్రీ మసీదు పేరు ఇంకా చాలామందిలో బాధను గుర్తు చేస్తోంది. ఎన్నికల సమయంలో ‘జై శ్రీరామ్’ నినాదం సరైందైతే, ‘అల్లాహు అక్బర్’ నినాదం కూడా సరైనదే,” అని ఆయన అన్నారు. మసీదు నిర్మాణానికి ఇప్పటివరకు భారీగా విరాళాలు వచ్చాయని, రూ. 2 కోట్లకు పైగా నిధులు సేకరించామని చెప్పారు. మొత్తం తానే భద్రపరిచినట్లు వివరించారు. ఫిబ్రవరిలో పనులు ప్రారంభించి, మూడు సంవత్సరాల్లో మసీదు పూర్తి చేయడమే లక్ష్యంగా ఉన్నట్లు కబీర్ వెల్లడించారు. ప్రతి శుక్రవారం నమాజ్ నిర్వహిస్తామని, నిర్మాణానికి అవసరమైన ఇటుకలు ఇప్పటికే వచ్చాయని తెలిపారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా.. తాను పార్టీని విడిచిపెట్టలేదని చెప్పుకొచ్చారు.
Add A Comment
