హైదరాబాద్: భాజపా అధికారంలోకి రావడానికి అనేక రకాలుగా ఓట్లు తొలగించి చోరీకి పాల్పడుతోందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలపనున్నట్లు చెప్పారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా గాంధీభవన్‌లో తెలంగాణ యువజన కాంగ్రెస్ మహా నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నంతోపాటు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ యూత్ కాంగ్రెస్ సైనికులుగా మారి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి శక్తివంతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా ఓటుచోరీపై నిరసనలు ఉద్దృతం చేయాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఇంటింటికి తీసుకెళ్లాలని చెప్పారు. అలాగే, సౌదీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన యాత్రికులకు యూత్ కాంగ్రెస్ నివాళులర్పించింది.
