సంగతి, హైదరాబాద్: ఇటీవల తల్లిదండ్రుల చేతిలో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపట్ల హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. చిన్నారులు తల్లిదండ్రుల చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసినట్లు ఆయన మానవతా దృక్పథంలో స్పందించారు. ఎక్స్ వేదికగా ఆయన తన భావాలను భావోద్వేగంతో ఇలా పంచుకున్నారు.
“నూతన సంవత్సర వెలుగులు చూడాల్సిన కళ్లు.. శాశ్వతంగా మూసుకుపోయాయి. గోరుముద్దలు తినిపించాల్సిన చేతులే విషం కలిపాయి. గుండెలకు హత్తుకోవాల్సిన వారే ఊపిరి తీశారు. అమృతం లాంటి ప్రేమను పంచాల్సిన తల్లిదండ్రులే.. ఇలా మారితే ఆ పసిప్రాణాలు ఎవరికి చెప్పుకోగలవు? నాన్న ఇచ్చిన పాలలో విషం ఉందని ఆ చిన్నారులకు ఏం తెలుసు? అమ్మ కొంగు ఉరితాడవుతుందని ఆ అమాయకులకు ఏం ఎరుక? కష్టాలు సునామీలా వచ్చినా సరే.. ఎదురీదాలే తప్ప, ఇలా పసిమొగ్గలను చిదిమేయడం పిరికితనం, పాపం, క్షమించరాని నేరం. చనిపోవడానికి ఉన్న ధైర్యం.. బ్రతకడానికి, పోరాడటానికి ఎందుకు సరిపోవడం లేదు? ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు.. అది మీపై ఆధారపడ్డ వారికి తీరని ద్రోహం. దయచేసి ఆలోచించండి.. క్షణికావేశంలో నూరేళ్ళ జీవితాన్ని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి. బ్రతికి గెలవండి.. పారిపోయి ఓడిపోవద్దు” అని రాసుకొచ్చారు. ఇటీవల నాగర్ కర్నూల్ కు చెందిన ప్రసన్న అనే మహిళ కొత్త సంవత్సరం వేల ఇద్దరు పిల్లలకు విషపూరిత ఆహారం పెట్టి తాను తినగా ఆమె తనతో పాటు మేఘన అనే కూతురు చనిపోగా.. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే నంద్యాలకు చెందిన సురేంద్ర వ్యక్తి తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను చనిపోయాడు. ఈ రెండు ఘటనలు న్యూఇయర్ రోజే జరగడంతో విషాదం నిండినట్లయింది.
