చిత్రం :శంబాల
హీరో హీరోయిన్: ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్
సంగీతం : శ్రీ చరణ్ పాకాల, దర్శకత్వం: యుగంధర్ ముని, విడుదల: 25.12.2025
ఎంతో కాలంగా విజయాన్ని ముద్దాడాలని ఎదురు చూస్తున్న ఆది సాయికుమార్ ఖాతాలో విజయం పడిందేమో తెలుసుకోవాలని ఉందా ఈ రివ్యూ చూడండి.
కథ:
వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఊరు శంబాల. ఆ ఊర్లో ఆకాశం నుంచి ఓ ఉల్క రాలి పడుతుంది. అప్పటి నుంచి ఆ ఊర్లో ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. ఎవరో ఒకరు విచిత్రంగా ప్రవర్తించడం, హత్యలు, ఆత్మహత్యలు అవుతుంటాయి. దాంతో ఆ ఊరి జనాలు తమ ఊరిని ఏదో భూతం ఆవరించిందని భయపడిపోతుంటారు. ముఖ్యంగా గ్రామం మొత్తం మూఢనమ్మకాలు తాండవిస్తాయి. దాంతో అక్కడ ఏం జరుగుతుందో కనిపెట్టాలని, అక్కడి రహస్యాలు గుర్తించాలని ప్రభుత్వం విక్రమ్ (ఆది సాయికుమార్) అనే యువ శాస్త్రవేత్తను పంపిస్తుంది. అయితే, కేవలం సైన్స్‌నే నమ్ముకున్న అతడు ఆ ఊరి రహస్యాలను ఛేధించాడా, ఆ ఊరి చరిత్ర గుర్తించాడా? చరిత్రకు శాస్త్రానికి సంబంధం ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మాత్రం కచ్చితంగా సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే..
థ్రిల్ చేస్తూ .. భయపెట్టే ఎన్ని సినిమాలు తీసినా ప్రేక్షకులు ఆదరిస్తారు అని నిరూపించే సినిమా ఇది. దేవుళ్లు, ఆత్మలు, పురాణాలు, రహస్యాలు అనేవి సాధరణంగానే మనిషికి అమిత ఆసక్తిని కలిగించే అంశాలు. వీటన్నింటిని ఒక కథలో సరిగ్గా పోస్తే ఆ సినిమా బంపర్ గా హిట్ కొట్టడం ఖాయం. సరిగ్గా శంబాల కూడా అలాంటి అంశాల కలబోత. కచ్చితంగా ప్రేక్షకులకు శంబాల ప్రపంచం నచ్చుతుంది. అందులోని కథ, కథనం మూఢనమ్మకాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, భూతం ఆవహించడం తర్వాత పరిణామాలు ప్రేక్షకుడిని థ్రిల్ చేస్తూ ఒక హారర్ మూవీ చూస్తున్న అనుభూతిని, అద్భుతంగా ఉందనే ఫీలింగ్‌ని ఇస్తుంది. ఈ చిత్రంలో రవివర్మ, మీసాల లక్ష్మణ్ పాత్రలతో పాటు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వచ్చే పాత్రలు కట్టిపడేస్తాయి. తీవ్ర ఉత్కంఠలో విరామానికి తీసుకొచ్చిన దర్శకుడు ఆ తర్వాత ఒక్కొక్క అంశాన్ని చక్కగా విప్పి ప్రేక్షకుడి ఆసక్తిని సమన్వయం చేస్తాడు. ఒక పసిపాపతో పతాక సన్నివేశాలు పెట్టి భావోద్వేగాలు పండించగలిగాడు. చిత్రం ముగిసే వరకు కూడా ఎలా కథానాయకుడు సమస్యను చేధిస్తాడనే ఉత్కంఠ మాత్రం ప్రేక్షకుడికి మిగులుతుంది.
పాత్రలు ఎలా ఉన్నాయంటే
ఈ చిత్రంలో విక్రమ్ పాత్ర పోషించిన ఆది తనను తాను నిరూపించుకోవాలనే తపనతో చాలా సహజంగా చేశారు. మనకు పాత్రనే దర్శనమే ఇస్తుంది తప్ప ఆయన గుర్తురాడు.. అంతబాగా ఈ చిత్రంలో నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లో ఆది చేసే పోరాటాలు కూడా బావున్నాయి. ఎన్నో రోజులుగా ఓ విజయం కోసం ఎదురు చూస్తున్న ఆదికి ఈ చిత్రం అది అందించిందనే చెప్పాలి. ఇక హీరోయిన్గా చేసిన అర్చన్ అయ్యర్ పాత్ర ఎవరూ ఊహించరు. అలాగే ఇతర పాత్రలు కూడా ఈ సినిమాలో మంచి ప్రభావమే చూపించాయి.
సాంకేతిక విలువలు
ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం ప్రధాన బలం. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ పలు చోట్ల ప్రేక్షకులను భయపెట్టాడు. ఈ చిత్రానికి విజువల్స్ అందించిన ప్రవీణ్ కే బంగారి శంబాల ప్రపంచంలోకి ప్రేక్షకులను చక్కగా తీసుకెళ్లారు. దర్శకుడి ప్రతిభ ఈ చిత్రంలో బాగా కనిపిస్తుంది.
తీర్పు: ఆది విజయం ఖాతా తెరిచాడు
