అగ్ర కథానాయకులు రజనీకాంత్, నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. గోవా వేదికగా జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి-2025) వేడుకల్లో వీరిద్దర్నీ ప్రత్యేకంగా సన్మానించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్వయంగా ప్రకటించారు. ‘‘చిత్ర పరిశ్రమలో 50ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా రజనీకాంత్, బాలకృష్ణలను సత్కరించనున్నాం. భారతీయ చలన చిత్ర సంస్కృతిపై వారి శాశ్వత ప్రభావాన్ని వేడుకలా చేసుకునే మైలురాయి ఇది. వారిద్దరూ దశాబ్దాలుగా అద్భుతమైన నటనతో ఎన్నో మంచి కథల్ని ప్రేక్షకులకు అందించి గొప్ప ప్రజాదరణతో ముందుకు సాగుతున్నారు. అందుకే వాళ్ల కృషికి గుర్తింపుగా ఇఫి ముగింపు వేడుకల్లో వారిని సన్మానించనున్నాం’’ అని ఎల్.మురుగన్ తెలిపారు. సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ ఇఫి-2025 వేడుక ఈనెల 20 నుంచి 28వరకు గోవా వేదికగా జరగనుంది.
Add A Comment
