సంగతి, నీతి సుధ: మనుషులకు ప్రతీది కొలమానంగా చూడటం, ఎక్కువ తక్కువలు నిర్ణయించడం అలవాటు. బేరీజు వేసుకొని మరీ ప్రతి పని చేస్తుంటారు. ముఖ్యంగా ఎక్కువ ప్రతిఫలాన్ని ఇచ్చేదానిని గౌరవించడం, తక్కువ దానిని చిన్న చూపు చూడటం చేస్తారు. కానీ వాస్తవానికి దేనికదే ప్రత్యేకమైనదే దృష్టి నేటి సమాజానికి కలగదు. దేనికి ఉండే విలువ దానికి ఉంటుందని, దేనిని కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. ఈ విషయం అత్యంత తేలికగా అర్థమయ్యేందుకు తేలికైన మాటల్లో వేమనగారు చక్కటి పద్యాన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడా పద్యం అందులోని నీతి మీకోసం..
చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచెమైన నదియు కొదువ కాదు
విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ వినురవేమ
భావం: మఱ్ఱి చెట్టుకు గింజ చాలా చిన్నగా ఉంటుంది. ఆ విత్తనం నుండే మనం మహావృక్షం పుట్టడం చూస్తాము. అలాగే మంచి మనసుతో చేసిన మంచి పని ఎంత చిన్నదయినా తక్కువది మాత్రం కాదు. ప్రపంచంలో ఎంత గొప్ప పని అయినా చిన్న సంకల్పంతోనే ప్రారంభమై అది అంతటా విస్తరిస్తుంది. చిన్నదే కదా అని దేనిని తక్కువ అంచనా వేయవొద్దు.
పై పద్యంలోని నీతి ఆధారంగా లోకంలో ఏది కూడా చిన్నది కాదు పెద్దది కాదని దేనికదే ప్రత్యేకతతో లోకంలో జన్మించిందనే విషయాన్ని గుర్తిస్తే మనకు విశాల దృక్పథం ఏర్పడటంతో పాటు మనసుకు కూడా ప్రశాంతత దక్కుతుంది. +
