సంగతి న్యూస్, న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూఢిల్లీకి చేరుకున్నారు. వివిధ రూపాల్లో భారత్‌పై అమెరికా ఆంక్షలు పెడుతున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. గురువారం సాయంత్రం 6.35గంటల ప్రాంతంలో ఢిల్లీలో అడుగుపెట్టిన ఆయనను స్వయంగా ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనం, కరచాలనంతో స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటన వ్యూహాత్మక భాగస్వామ్యం, మరియు ఒప్పందాలతో ఉండనుంది. భారత్-రష్యా 23వ శిఖరాగ్ర సదస్సులో భాగంగా ఆయన నాలుగేళ్ల తర్వాత భారత్‌లో అడుగు పెట్టారు. ఇంధనం, పరిశోధన, అంతర్జాతీయం వంటి అంశాలపై ఒప్పందాలు జరగనున్నట్లు తెలుస్తోంది.
పర్యటనలోని ప్రధాన అంశాలు
పుతిన్ సాయంత్రం 6:35 గంటలకు ఢిల్లీలో దిగగానే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పలాం ఎయిర్‌పోర్టులో ఆలింగనంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయనకు ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేశారు.
శుక్రవారం రాష్టపతి భవన్లో సత్కార కార్యక్రమంతో శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కానుంది. అనంతరం హైదరాబాద్ హౌస్ లో లంచ్ ఉంటుంది. అంతకు ముందు ఉదయం పుతిన్ రాజ్‌ఘాట్‌లో గాంధీజీకి నివాళులు అర్పిస్తారు.
రష్యా స్టేట్ బ్రాడ్‌కాస్టర్‌కి చెందిన భారత్ కేంద్రీకృత కొత్త ఛానల్‌ను పుతిన్ ప్రారంభిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నుండి విందు స్వీకరించిన తర్వాత శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భారత్‌ను విడిచి వెళ్తారు.
పుతిన్‌తోపాటు భారీ వ్యాపారవేత్తల బృందం భారత్ కు వచ్చింది. వీరితో ఒప్పందాల ద్వారా భారత్ వాణిజ్యలోటును తగ్గించనుంది.
రెండు దేశాల మధ్య చర్చల్లో రక్షణ, ఇంధనం, వాణిజ్యం ప్రధాన అంశాలు. షిప్పింగ్, ఆరోగ్యం, ఎరువులు, కనెక్టివిటీ రంగాల్లో పలు ఒప్పందాలు కుదరకున్నాయి.
శిఖరాగ్ర సమావేశానికి ముందు రక్షణ మంత్రులు సమావేశమై అదనపు S-400 వ్యవస్థల కొనుగోలు, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆలస్యమైన ఇతర రక్షణ పరికరాల సరఫరిపై సమగ్రంగా చర్చించారు.
2018లో 5 బిలియన్ డాలర్ల ఒప్పందం పై భారత్ కొనుగోలు చేసిన S-400 వ్యవస్థ ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కీలక పాత్ర పోషించింది.
రష్యా Su-57 ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్లను భారత్‌కు ఆఫర్ చేసే అవకాశం ఉందని క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ తెలిపారు. ఇది రఫేల్, F-21, F/A-18, యూరోఫైటర్లతో నేరుగా పోటీలోకి వస్తుంది.
భారత్ రష్యా నుండి పెద్దఎత్తున తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేసే దేశాలలో ఒకటి. అయితే అమెరికా ఇటీవలి ఆంక్షల వల్ల రష్యా ఆయిల్ దిగుమతుల్లో కొంత తగ్గుదల కనిపించింది.
