సంగతి న్యూస్ , మాస్కో: తాము యూరప్ తో యుద్ధానికి సిద్ధం అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ పక్క ఉక్రెయిన్ తో యుద్ధం విషయంలో శాంతి పరిష్కారం కోసం మాస్కోలో రష్యా–అమెరికా కీలక చర్చలు జరుగుతుండగా ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతలకు తెరలేపినట్లయింది. “యూరప్ యుద్ధం ప్రారంభించాలని నిర్ణయిస్తే, పరిస్థితి తీవ్రంగా మారుతుంది. అప్పుడు చర్చలు జరపడానికి ఎవరూ మిగలకపోవచ్చు” అని పుతిన్ హెచ్చరించినట్లు క్రెమ్లిన్ తెలిపింది. చర్చలు ముందుకెళ్లాలని యూరప్ కోరుకోవడం లేదని ఆయన అన్నారు.
ముందుకు సాగని అమెరికా దౌత్యం
అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మరియు డోనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్తో జరిగిన దాదాపు ఐదు గంటల చర్చలు జరిగాయి. అయితే, వీటిల్లో ఎలాంటి పురోగతి లేదని క్రెమ్లిన్ తెలిపింది. అమెరికా నుంచి వచ్చిన నాలుగు ప్రతిపాదనలను వచ్చినప్పటికీ పలు కీలక అంశాల్లో విభేదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ఉషాకోవ్ మాట్లాడుతూ “కొన్ని అమెరికా ప్రతిపాదనలు చర్చించదగ్గవిగా కనిపించాయి, కానీ కొన్ని పూర్తిగా అంగీకారయోగ్యం కావు” అని స్పష్టం చేశారు.
