ఇంటర్నెట్‌డెస్క్: దిల్లీలో ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయి (Delhi blast). ఈ నేపథ్యంలో మేడమ్ సర్జన్, డీ-6 వంటి పదాలు వెలుగులోకి వచ్చాయి. నిషేధిత జైషే మహ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధమున్న 43 ఏళ్ల ‘మేడమ్ సర్జన్’ షాహిన్ షాహిద్ (Shaheen Shahid).. ఉగ్రనెట్‌వర్క్‌లో కీలకంగా వ్యవహరించింది. ఈ నెట్వర్క్ ఆరు నగరాలు లక్ష్యంగా డీ-6 మిషన్‌కు ప్లాన్ చేసిందని విచారణలో భాగంగా అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఏఏ నగరాలను లక్ష్యంగా చేసుకోవాలి, నియామక వ్యూహాలు, డబ్బు తరలింపు, రహస్య పద్ధతిలో సమాచార మార్పిడి వంటి ప్లాన్స్ బయటకువస్తున్నాయి. జమ్మూకశ్మీర్, ఫరీదాబాద్‌లో అరెస్టు చేసిన ఉగ్ర అనుమానితులను విచారించగా ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి.
అధికారిక వర్గాల ప్రకారం.. ఫరీదాబాద్‌లో అరెస్టయిన షాహిన్.. టెర్రర్ మాడ్యూల్ (Faridabad Terror Module)కు కీలక వ్యక్తి. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలు, డిజిటల్ ఫైల్స్ ఇప్పుడు ముఖ్యమైన ఆధారాలుగా మారాయి. డిసెంబరు 6న భారీ కుట్ర చేసేందుకు ఈ నెట్వర్క్ ప్లాన్ చేసినట్లు వాటిని బట్టి తెలుస్తోంది. ఎర్రకోట పేలుడు బాంబర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ షకీల్, షాహిన్ ఈ మాడ్యూల్లో భాగం. వీరికి జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నాయి. విచారణలో భాగంగా షాహిన్ ఖాతాలను ఆడిట్ చేస్తున్నారు. దిల్లీ, కాన్పుర్, లఖ్‌నవూలో ఉన్న ఏడు బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఆమె అనూహ్యంగా మిస్ అయ్యే వరకు జీఎస్వీఎం మెడికల్ కాలేజ్‌లో పనిచేసింది. ఆ సమయంలో ఆమె ప్రవర్తన ఎలా ఉండేదనే దానిపైనా ఆరా తీస్తున్నారు.
ఇది చదవండి:ఉగ్ర నియామకాల్లో కొత్త ఎత్తుగడలు
షాహిన్ మృధు స్వభావి అని ఆమెతో పనిచేసినవారు చెప్పారు. విడాకుల బాధ నుంచి బయటపడేందుకు ఇబ్బందిపడేదన్నారు. ఇంటివద్ద చూసుకోవడానికి ఎవరూ లేకపోతే.. తన చిన్న బిడ్డను తీసుకొని విధులకు హాజరయ్యేదని వెల్లడించారు. క్యాంపస్ హౌస్‌లో నివసించిన ఆమెకు అందరితో మంచి సంబంధాలు ఉండేవని తెలుస్తోంది. 2013లో అనూహ్యంగా తన విధులకు తాత్కాలిక విరామం ఇచ్చిన ఆమె.. 2014లో తిరిగివస్తానని వెళ్లిపోయింది. తర్వాత మళ్లీ ఎప్పుడూ రాలేదని దర్యాప్తులో వెల్లడైంది. ఆమె ఇచ్చిన రిజిస్టర్ చిరునామా సరైందని కాదని 2016లో అధికారులు గుర్తించారు. 2021లో ఆమెను అధికారికంగా విధుల నుంచి తప్పించారు.
ఆ పర్యటనలో గ్రీన్ సిగ్నల్..
ఇక, టెర్రర్ మాడ్యూల్‌లోని సభ్యులు ఐఎస్ఐ హ్యాండ్లర్ ఉకాసాను కలిసేందుకు తుర్కియేలో పర్యటించారని తెలుస్తోంది. ఉకాసా అంటే అరబిక్‌లో స్పైడర్. ఫరీదాబాద్ మాడ్యూల్, ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌తో పాటు అన్సర్ ఘజ్వత్- ఉల్ హింద్ అనే సంస్థల నిర్వాహకులకు ఈ ఉకాసాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ మెసేజింగ్ ప్లాట్ఫామ్లో డాక్టర్ ఉమర్‌తో పాటు అతడి సహచరులు ఈ ఉకాసా హ్యాండ్లర్‌తో సంభాషించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. డాక్టర్ ఉమర్ (Dr Umar Un Nabi)తో సహా పలువురు 2022లో తుర్కియేలో పర్యటించినట్లు అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంకారాలో వారు రెండు వారాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ హ్యాండ్లర్ కూడా అంకారాలో ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పర్యటనలో డిసెంబర్ 6 దాడికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది.
