ఇంటర్నెట్‌డెస్క్: ‘వారణాసి’.. ఒక్క మాట చెప్పకుండా తాను తీయబోయే సినిమా స్థాయి ఏంటో యావత్ సినీ ప్రపంచానికి మరోసారి చూపించారు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి (SS Rajamouli). మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది. ప్రియాంక చోప్రా కథానాయిక. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో టైటిల్‌తో పాటు, ఈ చిత్ర (Varanasi Movie) కథా నేపథ్యాన్ని తెలిపేలా విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆ వీడియోలో ఉన్న అంశాలేంటి?(varanasi movie story) వాటి నేపథ్యమేంటి?
అంతుచిక్కని రహస్యం కాశీ క్షేత్రం..

వీడియో ఫస్ట్ షాట్. అది 512CE కాలం. వారణాసి క్షేత్రం. కాశీ పట్టణం పుట్టుక ఇప్పటికీ అంతుచిక్కని ఓ రహస్యం. కల్పం మొదట్లో ప్రకృతి మొత్తం జలమయమై ఉందట. ఆ సమయంలో బ్రహ్మదేవుడు సృష్టి సాగించే సామర్థ్యం కోసం తపస్సు చేసుకోవడానికి శివుడు త్రిశూలాగ్రమ్మీద సృష్టించిన భూ ఖండమే కాశీ. దీనిమీద కూర్చుని బ్రహ్మదేవుడు సమస్త లోకాలనూ అందులో భాగంగా భూమినీ సృష్టించాడట. దేవతలు, రుషుల విన్నపం మేరకు శివుడు త్రిశూలం మీద ఉన్న భూఖండాన్ని అలాగే దించి నేలమీద నిలబెట్టాడనీ అదే కాశీ పట్టణమనీ శివపురాణం పేర్కొంటోంది. అందుకే బ్రహ్మదేవుడి సృష్టి ప్రళయకాలంలో నశించినా కాశీపట్టణం మాత్రం చెక్కుచెదరదట. అలాంటి కాశీని నేపథ్యంగా తీసుకునే కథ మొదలయ్యే అవకాశముంది.
దూసుకొచ్చే ‘ఆస్ట్రాయిడ్ శాంభవి’

ఈ వీడియో మొదటి షాట్లో 512 CEలో రుషులు యజ్ఞం చేస్తూ కనిపించారు. యజ్ఞం నుంచి ఒక మహాశక్తి ఉద్భవిస్తుంది. కట్ చేస్తే, కాలాన్ని 2027CE అని చూపించారు. నాడు యజ్ఞం నుంచి పుట్టిన మహాశక్తి ‘ఆస్ట్రాయిడ్ శాంభవి’గా మారి భూమిని బద్దలు కొట్టేందుకు దూసుకొస్తూ కనిపించింది. ఆ ఉల్కతో భూమికి వచ్చిన ఆపద ఏంటో తెలియాలి. అందులోని ఓ భాగం అంటార్కిటికాలోని ‘రాస్ ఐస్ షెల్ఫ్’ను ఢీకొడుతుంది.
ఏమిటీ ‘రాస్ ఐస్ షెల్ఫ్’..

‘రాస్ ఐస్ షెల్ఫ్’ అనేది అంటార్కిటికా ఖండంలోని రాస్ సముద్రంపై తేలియాడే అతిపెద్ద మంచు ముక్క. ఇది సుమారు 500,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న ఫ్రాన్స్ దేశమంత పెద్దది. హిమానీనదాల నుంచి ప్రవహించే మంచుతో ఇది ఏర్పడింది. సగటున 100 మీటర్ల మందం ఉండే ఈ ఐస్ షెల్ఫ్.. మరికొన్ని చోట్ల అంతకు కొన్ని వందల మీటర్ల మందంతో ఉంటుంది. పైకి కనిపించేది కేవలం 10 శాతం మాత్రమే కాగా.. 90 శాతం భాగం సముద్రం అడుగు ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. దీన్ని గ్రేట్ ఐస్ బ్యారియర్గా పేర్కొంటారు. మంచు కరిగి సముద్రం మట్టాలు పెరగకుండా ఇది అడ్డుకుంటుంది. ‘ఆస్ట్రాయిడ్ శాంభవి’ దీన్ని ఢీకొట్టిన కారణంగా అది విరిగిపోయి ఇది కరుగుతున్నట్లు చూపించారు. అక్కడి నుంచి ‘రాస్ ఐస్ షెల్ఫ్’ అడుగు భాగంలో ఓ పురాతన ఓడ రెండు ముక్కలై కనిపించింది. మరి అది ఎవరిది? ఎందులో ఎవరు ప్రయాణించారు? కథలో దాన్నికున్న ప్రాముఖ్యత ఏంటో తెలియాలి.
జంతుజాలం.. అంబుసలి వైల్డర్నెస్..

అక్కడి నుంచి ఆఫ్రికాలోని అంబుసలి వైల్డర్నెస్ అంటూ వన్యమృగాలను చూపించారు. వాటి వెనుక కిలిమంజారో పర్వతం కూడా కనిపిస్తుంది. కిలిమంజారోకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ పర్వతంపై భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి. పచ్చగడ్డి నేలలు, ఇసుక నేలలు, సాగుకు అనువైన నేలలు, మంచుతో కప్పిన నేల, వర్షారణ్యాలు ఇలా అనేక ప్రత్యేకతలకు నెలవు. అంతేకాదు, కొన్ని వందల రకాల జంతు జాలానికి అది కేంద్రం. అయితే, ‘వారణాసి’ గ్లింప్స్‌లో అక్కడ జంతువులన్నీ ప్రాణ భయంతో పరిగెడుతూ కనిపించాయి. ఆ వెనుక ఓ వ్యక్తి ప్యారాషూట్ వేసుకుని దిగుతూ కనిపించారు. అది ఎవరు? ఆ వెంటనే హిప్పొపోటమస్ బారి నుంచి ఓ కోతి తప్పించుకునే ప్రయత్నం చేసే షాట్ వేశారు. అక్కడ కూడా ఓ వ్యక్తి కోతికి సాయం చేసేందుకు రోప్‌ను అందిస్తూ కనిపించాడు. ఇంతకీ అదెవరు?
వానాంచల్.. ఉగ్రభట్టి గుహ.. ఛిన్నమస్తాదేవి..

ఇక ఈ వీడియోలో మరో హైలైట్ వానాంచల్.. ఉగ్రభట్టి గుహ. ఇది కేవలం ఒక ఫిక్షన్ గుహ. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి సమాచారమూ అందుబాటులో లేదు. అయితే, వీడియో చూపించిన దేవతా మూర్తి పేరు ‘ఛిన్నమస్తాదేవి’. ఆమె కూడా పార్వతీదేవి అంశ. ‘స్వయం శిరః ఖండిత దేవత’గా పేర్కొంటారు. హైందవంలో ఉన్న ఉగ్ర దేవతల్లో ఈమె ఒకరు. నారద-పంచరాత్ర పురాణాల్లో ఒక కథ ఉంది. ఒకసారి మందాకిని నదిలో స్నానమాచరిస్తుండగా పార్వతీ దేవికి లైంగిక ఉత్తేజం కలిగి నల్లగా మారింది. ఇంతలో ఆమె సేవకురాళ్లయిన ఢాకిని, వర్ణిని (జయ, విజయ)లకు ఆకలి కలిగి దేవతను తమ ఆకలి తీర్చమని అడిగారు. జగన్మాత పార్వతి.. చుట్టుపక్కల ఎంత వెతికినా తినడానికి ఏమీ దొరకలేదు. అప్పుడు ఆమె తన శిరస్సును ఖండించుకోగా రక్తం మూడు దిశల్లో ధారగా చిమ్మింది. అందులో ఒకటి జయ నోట్లోకి, రెండోది విజయ నోట్లోకి వెళ్లగా, మూడోది ఖండించిన పార్వతి శిరస్సు నోట్లోకి ప్రవహించాయి. రతిమన్మథుల జంటపై ఛిన్నమస్త నిలబడి ఉంటుంది. తాంత్రికులు అతీంద్రియ శక్తుల సిద్ధి కోసం ఈమెను ఉపాసిస్తారు. మరి ‘వారణాసి’లో ఆమెను ఉపాసించేది ఎవరు? వీడియోలో ఎర్ర చీరలో కనిపించిన ఆ వ్యక్తి ఎవరు? ఆమెను కాపాడేందుకు హీరో ప్రయత్నించే సన్నివేశం కూడా అక్కడే ఉంటుంది? ఈ సినిమాలో ప్రియాంక చోప్రా పేరు మందాకిని కావడం మరో విశేషం.
త్రేతాయుగంతో లింక్.. సినిమాకే హైలైట్

ఈ కథతో రాజమౌళి ప్రేక్షకుడిని వారణాసి, అంటార్కిటికా, ఆఫ్రికా, వానాంచల్కు మాత్రమే కాదు.. టైమ్ ట్రావెల్ చేయించి మరీ త్రేతాయుగానికి తీసుకెళ్లనున్నారు. ఛిన్నమస్తాదేవిని చూపించిన తర్వాత త్రేతాయుగంలోని లంకా నగరాన్ని వీడియోలో చూపించారు. రామ-రావణ యుద్ధం సన్నివేశాన్ని ఇందులో చూపించారు. మొదటగా హనుమ, ఆయన తోకపై రథం వెళ్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఆ రథంలో ఉన్నదెవరు? అక్కడి నుంచి వానర సేన ఒకరిపై ఒకరు నిలబడగా.. అగ్రభాగంలో ఉన్న శ్రీరామచంద్రుడు తనకెదురుగా బండరాయిని పట్టుకుని వస్తున్న రాక్షసుడిపై బాణాన్ని సంధిస్తూ కనిపించారు. మహేశ్‌బాబు రాముడిగా కనిపిస్తారని స్వయంగా రాజమౌళినే ప్రకటించారు. మరి హనుమగా ఎవరిని చూపిస్తారు? ఆ బండరాయి విసిరే రాక్షసుడు ఎవరనేది తెలియాలి. ఇక ‘వారణాసి’ సినిమాలో ఈ ఎపిసోడు హైలైట్‌గా నిలవడం ఖాయం.
మణికర్ణిక ఘాట్ వారణాసి..

కాశీ నగరంతో కథను మొదలు పెట్టి, మళ్లీ అదే కాశీలోని మణికర్ణిక ఘాట్‌తో ముగించారు రాజమౌళి. నిర్విరామంగా ప్రజ్వరిల్లే మహా శ్మశానం మణికర్ణిక చితిమంటలు మనలో వైరాగ్యాన్ని కలిగిస్తాయి. క్షణభంగురమైన ఈ దేహం ఎప్పటికైనా పంచభూతాల్లో కలిసిపోవాల్సిందనే సత్యాన్ని తెలియజేస్తాయి. కానీ, ప్రకృతి ధర్మాన్ని మరిచి, దైవాన్ని ధిక్కరించి మృత్యువును జయించాలని చూసే దుష్టులను అంతం చేయడానికి ఆ మహారుద్రుడే ‘ప్రళయ కాల’ రుద్రుడిగా మారి, అంతం చేయడం ఖాయమని మహేశ్‌బాబు ఎంట్రీతో చూపించారు. ఇందులో ఆయన పేరు కూడా ‘రుద్ర’ కావడం గమనార్హం. రాజమౌళి గత సినిమాలకు పూర్తి భిన్నంగా, మహేశ్‌బాబును మునుపెన్నడూ చూపించని విధంగా ‘వారణాసి’లో చూపించబోతున్నారన్నది మాత్రం ఖాయం. 2027 (varanasi movie release date) వేసవిలో ఈ మూవీ రానుంది.
