ఈనాడు, హైదరాబాద్: విశ్రాంత ఆచార్యులకు నెలనెలా సులువుగా పింఛన్ సొమ్ము వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం అధికారులు ‘డిజిటల్ ఎగ్జిస్టెన్సీ’ ధ్రువపత్రాన్ని ఇస్తున్నారు. డిజిటల్ పత్రం ఇవ్వకముందు పదవీ విరమణ చేసిన ఆచార్యులు, బోధనేతర సిబ్బందికి పింఛన్ డబ్బు ఇవ్వాలంటే ‘లైఫ్ సర్టిఫికెట్’ను బ్యాంకు అధికారులకు సమర్పించాలి. వైద్యులు, రెవెన్యూ అధికారులు లైఫ్ సర్టిఫికెట్‌ను జారీచేస్తే.. ఓయూ ధ్రువీకరించేది. ఇంత ప్రయాస అవసరం లేకుండా 3 వేల మంది పింఛన్‌దారులకు అధికారులు డిజిటల్ ధ్రువపత్రాలు ఇస్తున్నారు. ‘జీవన్ ప్రమాణ్ పోర్టల్’కు అనుసంధానమవ్వడం వల్ల ఇదంతా సాధ్యమయ్యిందని ఓయూ ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగరం వివరించారు.
డౌన్లోడ్ చేసుకోండిలా..
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు జీవన్ ప్రమాణ్ పోర్టల్‌ను కేంద్రం ఇటీవలే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈనెల 1 నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను ఈ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. జీవన్ ప్రమాణ్ వెబ్సైట్లోకి వెళ్లి పింఛన్‌దారులు వారి వ్యక్తిగత వివరాలు, పింఛన్ నంబరు, ఆధార్, చిరునామా, సెల్ఫీ అప్లోడ్ చేస్తే చాలు. గంటల వ్యవధిలో డిజిటల్ ధ్రువపత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తపాలా సిబ్బంది సాయంతోనూ..
జీవన్ ప్రమాణ్ పోర్టల్ గురించి తెలిసినా.. వివరాలు నమోదు చేసుకోలేని పింఛన్‌దారులు సమీపంలోని మీ-సేవాకేంద్రాలకు వెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అక్కడికి వెళ్లలేని వారు తమ ఇంటికి వచ్చే తపాలాశాఖ సిబ్బందిని కూడా కోరవచ్చు. వివరాలు నమోదు చేసుకున్నాక పింఛన్‌దారుడి ఫొటో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. నవంబరు 30వరకూ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందేదుకు గడువు ఉంది.
