పట్నా (బిహార్): జన్ శక్తి జనతా దళ్ (జేజేడీ) నాయకుడు, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరోసారి వివాదాల మధ్య నిలిచారు. గతంలో తనతో సంబంధం ఉందని ప్రచారంలో ఉన్న ఓ మహిళకు తాజాగా శిశువు జన్మించిందని, ఆ బిడ్డకు తానే తండ్రి అన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ కథనాలపై తేజ్ ప్రతాప్ బహిరంగంగా స్పందించారు.
ఈ వ్యవహారం తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కావాలని సృష్టించిన కుట్రగా ఆయన అభివర్ణించారు. ఆ శిశువుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, ఈ తప్పుడు ప్రచారం వెనుక తన రాజకీయ ప్రత్యర్థులే కాకుండా తన వర్గానికి చెందిన కొందరు నేతలూ ఉన్నారని తేజ్ ప్రతాప్ ఆరోపించారు. ముకేశ్ రౌషన్, సంజయ్ యాదవ్, శక్తి సింగ్ యాదవ్, రమీజ్, సునీల్ సింగ్ల పేర్లను ప్రస్తావిస్తూ, వీరిలో ఒకరు రాజ్యసభ సభ్యుడు, మరొకరు ఎమ్మెల్సీ అని తెలిపారు. ఈ ఐదుగురు కలిసి తనపై కావాలని బురదజల్లుతున్నారని మండిపడ్డారు.
తన రాజకీయ ఎదుగుదల్ని సహించలేకే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని తేజ్ ప్రతాప్ వ్యాఖ్యానించారు. గతేడాది ఓ మహిళతో ఉన్న ఫొటోలు ఫేస్బుక్లో వైరల్ కావడంతో ఆయనను రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో తన సోషల్ మీడియా ఖాతాను హ్యాక్ చేశారని, కొందరు కావాలనే ఆ పని చేశారని తేజ్ ప్రతాప్ ఆరోపించారు.
ఈ సందర్భంగా అనుష్క యాదవ్, ఆకాష్ భాటి అనే వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ, ఆ బిడ్డకు అసలు తండ్రి ఎవరో తనకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పేరును కావాలనే ఈ వివాదంలోకి లాగి మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాను తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానని తెలిపారు.
ఈ వ్యవహారంపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని, నిందితులపై కోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడతానని తేజ్ ప్రతాప్ స్పష్టం చేశారు. ఈ ఘటన బిహార్ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
