హైదరాబాద్:
మున్సిపల్ ఎన్నికలను ఏకాభిప్రాయంతో ఎదుర్కోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు సూచించారు. ఎన్నికల ప్రచారం, నిర్వహణకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, మంత్రులతో ఆయన జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులపై సీఎం వివరాలు తెలుసుకున్నారు. బలహీనంగా ఉన్న మున్సిపాలిటీల్లో పోలింగ్ శాతం పెంచే వ్యూహాలపై ప్రత్యేకంగా చర్చించారు. స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఓటింగ్ నిర్వహణ జరగేలా చర్యలు తీసుకోవాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చొరవ చూపాలని సూచించారు. అలాగే ఇవాళ, రేపు నాయకులు ఓటర్లకు అందుబాటులో ఉండి సమస్యలు వినాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
