ఇంటర్నెట్ డెస్క్: సాంకేతిక పరిజ్ఞానం మన పని విధానాన్ని మార్చేస్తుందని, దాన్ని భయపడకుండా అర్థం చేసుకుని అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అయితే టెక్నాలజీకి పూర్తిగా ఆధీనమై, దానికే బానిసలుగా మారకూడదని స్పష్టం చేశారు. ‘పరీక్షా పే చర్చ’ రెండో ఎడిషన్‌లో భాగంగా విద్యార్థులతో సంభాషించిన ప్రధాని, వారి భవిష్యత్ కెరీర్‌కు ఉపయోగపడే పలు కీలక సూచనలు చేశారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓర్పుగా సమాధానాలు ఇచ్చారు.
విద్యార్థుల సందేహాలకు ప్రధాని ఇచ్చిన సమాధానాలు ఇవీ…
క్రమశిక్షణ ముఖ్యమా? ప్రేరణ ముఖ్యమా?
మోదీ: ఈ రెండింటిని పోల్చాల్సిన అవసరం లేదు. ఎంత ఉత్సాహం ఉన్నా దాన్ని ఆచరణలో పెట్టే క్రమశిక్షణ లేకపోతే ఫలితాలు రావు. సమయాన్ని పాటించడం, నిలకడగా ప్రయత్నించడం, స్వీయ నియంత్రణ ఇవే ప్రేరణను విజయంగా మార్చుతాయి.
ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం నిజమేనా?
ప్రధాని: టెక్నాలజీ మన పనిని సులభతరం చేస్తుంది. దాన్ని సరైన విధంగా ఉపయోగించుకోవడం నేర్చుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. ఏఐతో కలిసి ఎలా పనిచేయాలో తెలుసుకోవడం విద్యార్థులకు చాలా అవసరం.
విద్యార్థులు తప్పక వెళ్లాల్సిన ప్రదేశాలు ఏవి?
మోదీ: ముందుగా మీ చుట్టుపక్కలే చూడాలి. మీ జిల్లా, నగరం, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ప్రాంతాల జాబితా తయారు చేసుకోండి. దగ్గరలోని ప్రదేశాల ప్రాముఖ్యతను తెలుసుకుంటే అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది.
మంచి నాయకత్వం ఎలా సాధ్యం?
ప్రధాని: నియమాలకు భయపడకుండా, విధేయతతో పని చేయాలి. నిబద్ధత, నిరంతర శ్రమే నాయకత్వానికి మూలం. ఒక నాయకుడి ముఖ్య లక్షణం ఏమిటంటే… తన ఆలోచనలను కనీసం పది మందికైనా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పగలగడం.
అంతేకాదు, మెదడు చురుకుగా పనిచేయాలంటే సరిపడా నిద్ర తప్పనిసరిగా అవసరమని ప్రధాని సూచించారు. చదువుతో పాటు జీవితాన్ని ఆస్వాదించాలన్నారు. ఆత్మవిశ్వాసం ఉంటేనే లక్ష్యాలను చేరుకోగలమని విద్యార్థులకు ధైర్యం చెప్పారు.
