కాంగ్రెస్ పెద్దలపై బీజేపీ ఎంపీ
సంగతి న్యూస్, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ పెద్దలపై బీజేపీ ఎంపీ మనోజ్ తివారి ఘాటు విమర్శలు చేశారు. తాము రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ హాజరుకావడంపై మీకేంటి సమస్య అని నిలదీశారు. దేశానికి సంబంధించి విదేశాంగ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి భిన్న పార్టీల నాయకులతో అవసరం ఉంటుందని, వారి నైపుణ్యాన్ని కూడా ఉపయోగించుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ విషయాన్ని గుర్తు చేశారు.
ఆ సమయంలో బహుళపక్ష ప్రతినిధులు కలిసి పనిచేసిన విషయాన్ని ప్రస్తావించిన మనోజ్ తివారి “అనేక మంది అనుభవజ్ఞులు, ఇతర పార్టీలకు చెందినవారు కూడా, ప్రభుత్వ విదేశాంగ ప్రయత్నాలకు సహకరిస్తున్నారు. శశి థరూర్ కూడా వారిలో ఒకరు. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకత్వానికి ఎందుకు ఇబ్బంది అవుతుందో నాకు అర్థం కావడం లేదు.” అని వ్యాఖ్యానించారు. కాగా, సీనియర్ నాయకులు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలను ఆహ్వానించకుండా కేవలం థరూర్ ను పిలవడం, ఆయన తమ పార్టీ పెద్దలను కాదని వెళ్లడంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.
