సంగతి న్యూస్, మధ్యప్రదేశ్: ఓ విద్యార్థి విషయంలో ఘోరం జరిగింది. సరదాగా చేసిన ఓ చిన్నపనికి ఓ ప్రైవేటు పాఠశాల కఠినంగా వ్యవహరించింది. 52 సార్లు సారీ చెప్పినా అతడిని ఆత్మహత్యకు ప్రయత్నించేలా పురికొల్పింది. స్కేటింగ్ క్రీడాకారుడైన ఆ బాలుడు మూడో అంతస్తు నుంచి దూకి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. మధ్యప్రదేశ్లోని రత్నం జిల్లాలో ఒక ప్రైవేట్ పాఠశాలలో ఈ విషాద ఘటన చోటుచేసుకోగా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతని పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందని వైద్యులు చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది.
అసలేం జరిగింది?
13 ఏళ్ల బాలుడైన సదరు విద్యార్థి గురువారం మొబైల్ ఫోన్ తీసుకువచ్చి తరగతి గదిలో పాఠాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది గుర్తించిన పాఠశాల యాజమాన్యం అతని తల్లిదండ్రులకు కబురు చేసి రమ్మంది. అక్కడున్న పాఠశాల సీసీటీవీ ఫుటేజీ ప్రకారం ఆ బాలుడు అప్పటికే ప్రిన్సిపాల్ కార్యాలయంలోకి వెళ్లి నాలుగు నిమిషాల పాటు 52 సార్లు క్షమాపణ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియోను పోలీసులు పరిశీలిస్తున్నారు. విద్యార్థి సమాచారం ప్రకారం ప్రిన్సిపాల్ తనను “నీ కెరీర్ను ముగిస్తాను”, సస్పెండ్ చేస్తానని, “నీ మెడల్స్ తీసుకుంటాను” అని బెదిరించాడు అని చెప్పాడు. ఇప్పటికే జాతీయ స్థాయిలో రెండు సార్లు స్కేటింగ్లో బహుమతులు గెలుచుకున్న అతడు ఆ బెదిరింపుతో భయపడి భవనంపై నుంచి దూకాడు. తాను వెయిటింగ్ హాల్ వద్ద వేచి ఉండగానే ఈ సంఘటన జరగడంతో విద్యార్థి తండ్రి నిశ్చేష్టుడయ్యాడు.
