Prime Minister Viksit Bharat Rozgar Yojana Scheme | యువత కోసం కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారికి PMVBRJY కింద రూ.15000 అందజేస్తారు. ఉద్యోగం కల్పించిన కంపెనీకి ఒక్క ఉద్యోగికి నెలకు రూ.3000 వరకు ఇస్తారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 2025 ఆగస్టు 15న ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఈ పథకం గురించి ప్రకటన చేశారు. వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం ప్రయోజనాలు, అర్హతలు తదితర పూర్తి వివరాలు..
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. యువత కోసం కొత్త పథకాన్ని ప్రకటించారు. ప్రైవేటు కంపెనీల్లో కొత్తగా చేరే ఉద్యోగులకు ప్రభుత్వం తరఫున రూ.15 వేలు అందించనున్నట్లు తెలిపారు. ఉద్యోగం ఇచ్చే కంపెనీకి కూడా ఒక్కో ఉద్యోగికి ప్రతి నెలా రూ.3000 వరకు ప్రోత్సాహకం అందించనున్నారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (PMVBRJY Scheme) పేరుతో తీసుకొచ్చిన ఈ పథకానికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించినట్లు 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 2025 ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రకటించారు. పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ప్రయోజనాలు, అర్హతలు, దరఖాస్తు విధానం, ఇతర పూర్తి వివరాలు..
ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (PMVBRJY) అంటే ఏమిటి?
దేశంలో ఉద్యోగ అవకాశాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (PMVBRJY)’. ఈ పథకాన్ని 2025-26 బడ్జెట్లో ప్రకటించారు. ఇది 2025 ఆగస్టు 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ పథకం కింద, మొదటిసారి ఉద్యోగంలో చేరి EPFO (Employees’ Provident Fund Organisation)లో సభ్యులయ్యే యువతకు ప్రభుత్వం రూ.15,000 వరకు అదనంగా చెల్లిస్తుంది. అంతేకాకుండా, ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీలకు కూడా ఒక్కో ఉద్యోగికి రూ.3,000 వరకు ప్రోత్సాహకం అందిస్తారు. కంపెనీలకు రెండేళ్ల పాటు ఈ డబ్బులు ఇస్తారు. తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల ఇక్కడ 4 సంవత్సరాల వరకు డబ్బులు లభిస్తాయి. ఈ పథకాన్ని గతంలో ELI (Employment Linked Incentive Scheme) అనే పేరుతో అమలుచేశారు.
పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన లక్ష్యాలు:
✦ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించడం.
✦ దేశంలో 3.5 కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగాలను సృష్టించడం పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ముఖ్య ఉద్దేశం.
✦ ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు కూడా ఉద్యోగికి రూ.3,000 చొప్పున ప్రోత్సాహకం అందించడంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయి.
పీఎం వికసిత్ భారత్ ద్వారా ఉద్యోగికి, కంపెనీకి ప్రోత్సాహకం ఎలా ఇస్తారు?
పీఎం వికసిత్ భారత్ ద్వారా వచ్చే 2 సంవత్సరాల్లో 1.92 కోట్ల మంది యువతీ యువకులు కొత్తగా ఉద్యోగాల్లో చేరతారని అధికారుల అంచనా. ఈ పథకం ద్వారా ఉద్యోగులకు, కంపెనీలకు కూడా ప్రయోజనం దక్కుతుంది.
1. ఉద్యోగికి ప్రోత్సాహకం:
కొత్తగా ఉద్యోగంలో చేరి తొలిసారి UAN (Universal Account Number) నంబర్ పొందిన లబ్ధిదారునికి రూ. 15,000 లభిస్తాయి. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా ఉద్యోగంలో చేరిన తర్వాత అందజేస్తారు. గరిష్టంగా రూ.1 లక్ష వరకు జీతం ఉన్నవారికి మాత్రమే ఈ ప్రయోజనం అందుతుంది. 6 నెలల ఉద్యోగం తర్వాత మొదటి విడత కింద రూ.7500 చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన ఏడాది తర్వాత రెండో విడత కింద రూ.7500 అందజేస్తారు.
2. కంపెనీకి ప్రోత్సాహకం:
కొత్త ఉద్యోగిని నియమించినందుకు కంపెనీలకు ప్రతి ఉద్యోగికి నెలకు రూ.3,000 చొప్పున ప్రోత్సాహకం అందిస్తారు. ఈ మొత్తాన్ని 2 సంవత్సరాల వరకు అందిస్తారు. తయారీ రంగంలో మాత్రం 4 సంవత్సరాల వరకు ఇస్తారు. కొత్త ఉద్యోగుల వేతనాల ఆధారంగా కంపెనీలకు డబ్బులు ఇస్తారు. ప్రభుత్వం ఈ మొత్తాన్ని 6 నెలలు, 12 నెలలు, 18 నెలలు, 24 నెలలకు ఒకసారి చెల్లిస్తుంది.
| ఉద్యోగి వేతనం | కంపెనీకి ఇచ్చే ప్రోత్సాహకం |
| రూ. 10,000 వరకు | రూ. 1,000 |
| రూ. 10,000 – రూ. 20,000 | రూ. 2,000 |
| రూ. 20,000 – రూ. 1,00,000 | రూ. 3,000 |
పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అర్హతలు:
- మొదటిసారి EPFOలో చేరే యువతీ యువకులు ఈ పథకానికి అర్హులు.
- కంపెనీ EPFOలో రిజిస్టర్ అయి ఉండాలి.
- ఉద్యోగి మొత్తం జీతం రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
- ఉద్యోగి కనీసం 6 నెలల పాటు ఒకే కంపెనీలో పనిచేయాలి.
- ఉద్యోగికి ఇంతకు ముందు EPFO ఖాతా ఉండకూడదు.
- 50, అంతకంటే తక్కువ మంది స్టాఫ్ ఉన్న కంపెనీ.. కొత్తగా కనీసం ఇద్దరు ఉద్యోగులను నియమించుకోవాలి.
- 50 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీ కొత్తగా కనీసం ఐదుగురు ఉద్యోగులను చేర్చుకోవాలి.
PMVBRJY పథకానికి అవసరమైనవి:
✧ EPFO యొక్క UAN నంబర్
✧ కంపెనీ నియామక పత్రం
✧ ఆధార్ కార్డు
✧ ఆధార్ కార్డుతో లింక్ చేసుకున్న బ్యాంక్ ఖాతా
PMVBRJY పథకానికి ఎలా దరఖాస్తు చేయాలి?
ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పథకం కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయవలసిన అవసరంలేదు. యువకుడు కొత్తగా ఉద్యోగంలో చేరి PF (Provident Fund) ఖాతా తెరిచిన వెంటనే, అతడు ఈ పథకానికి అర్హుడు అవుతాడు. ఉద్యోగి UAN నంబర్ ఆధారంగా ప్రభుత్వం నేరుగా అతడి బ్యాంక్ ఖాతాలోకి డబ్బును బదిలీ చేస్తుంది. ఉద్యోగి జీతం రూ.1 లక్ష లేదా అంతకంటే తక్కువ ఉండాలి. శ్రమ్ సువిధ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే EPFO కోడ్ వస్తుంది. ఈ కోడ్ సాయంతో EPFO ఎంప్లాయర్ లాగిన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి.
