ఇంటర్నెట్ డెస్క్: తన మద్దతుదారులకు ఆమె ఒక ఆధునిక, అభివృద్ధి చెందుతున్న బంగ్లాదేశ్ నిర్మాత. విమర్శకులకు మాత్రం.. అధికార దాహంతో ఉన్న నిరంకుశ నాయకురాలు. ఆమే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina). దశాబ్దాల పాటు ఆ దేశ రాజకీయ చరిత్రను తానై నడిపించిన ఆమెను ‘ఉక్కు మహిళ’గా వ్యవహరిస్తుంటారు. కానీ, తన హయాంలో ఏర్పడ్డ ట్రైబ్యునలే.. ఇప్పుడు ఆమెకు మరణశిక్ష (Sheikh Hasina death sentence) విధించడం గమనార్హం.
విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా..
నాటి తూర్పు పాకిస్థాన్‌లోని తుంగిపారాలో 1947 సెప్టెంబరు 28న షేక్ హసీనా జన్మించారు. తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఆ దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలకంగా వ్యవహరించి జాతిపితగా నిలిచిపోయారు. ఢాకా విశ్వవిద్యాలయం నుంచి బెంగాలీ సాహిత్యంలో హసీనా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలోనే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1968లో అణు శాస్త్రవేత్త ఎం.ఎ.వాజెద్ మియాను వివాహం చేసుకున్నారు. రాజకీయాలకు భిన్నంగా ఆయన విద్యావేత్తగా నిరాడంబర జీవితం గడిపారు. 2009లో ఆయన మరణించే వరకు ఆమెకు తోడుగా ఉన్నారు. వారికి సజీబ్ వాజెద్ జాయ్ అనే కొడుకు, సైమా వాజెద్ పుతుల్ అనే కూతురు ఉన్నారు.
కుటుంబ సభ్యులంతా హత్య
1975 ఆగస్టులో జరిగిన సైనిక తిరుగుబాటు హసీనా (Sheikh Hasina) జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ ఘర్షణల్లో ఆమె తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులు ఇంకా కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు. ఆ సమయంలో విదేశాల్లో ఉండటం వల్ల హసీనా, ఆమె చిన్న చెల్లెలు రెహానా మాత్రమే బతికి బయటపడ్డారు. నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఆమెకు ఆశ్రయం ఇచ్చారు. ఆరు సంవత్సరాల తర్వాత 1981 మేలో బంగ్లాదేశ్‌కు హసీనా తిరిగొచ్చారు. దేశానికి రాకముందే ఆమెను అవామీ లీగ్ పార్టీ తమ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
తిరుగులేని నాయకురాలిగా
దేశానికి తిరిగి వచ్చే సరికే హసీనా ప్రధాన ప్రత్యర్థి ఖలీదా జియా ఆమె కోసం వేచి చూస్తున్నారు. హత్యకు గురైన అధ్యక్షుడు జియావుర్ రెహమాన్ భార్యే ఈ ఖలీదా. వీరిద్దరినీ ‘Battling Begums’ అని వ్యవహరిస్తుంటారు. వీరిద్దరే తమదైన సిద్ధాంతాలు, పోరాటాలతో మూడు దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రను రచించారు. హసీనా మొదటిసారి 1996లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 2001లో అధికారం కోల్పోయారు. 2008లో భారీ విజయం సాధించి సుదీర్ఘ పాలన మొదలుపెట్టారు. 2014, 2018 ఎన్నికల్లోనూ అవామీ లీగ్ పార్టీయే గెలిచింది. దీంతో ప్రపంచంలోనే ఎక్కువ కాలం పాలించిన మహిళా నేతల్లో ఒకరిగా చరిత్ర సృష్టించారు.
ఇది చదవండి: హసీనాకు మరణ శిక్ష.. బంగ్లా ట్రైబ్యునల్ సంచలన తీర్పు
అభివృద్ధి.. ఆరోపణలు
ఆమె పాలనలో బంగ్లాదేశ్ చాలా వేగంగా ఆర్థిక వృద్ధిని సాధించింది. పద్మా వంతెన వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తయ్యాయి. పేదరిక నిర్మూలనలో దేశం పురోగమించింది. బంగ్లాదేశ్ ప్రపంచ వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా మారింది. ఈ ప్రశంసలతో పాటే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఆమె ప్రభుత్వం అసమ్మతిని అణచివేసిందని, మీడియాపై ఆంక్షలు విధించిందని, ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేసిందని, భద్రతా శక్తుల అధికారాలను పెంచిందనే ఆరోపణలు వచ్చాయి.
విద్యార్థుల నిరసనలతో పతనం
2024లో స్వాతంత్య్ర పోరాట వీరుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థి నిరసనలు చివరికి దేశవ్యాప్త తిరుగుబాటుగా మారాయి. ఈ నిరసనలే హసీనా (Sheikh Hasina) పాలనను అంతం చేశాయి. ఆమె ప్రభుత్వం చేపట్టిన భద్రతా చర్యల వల్ల హింస పెరిగింది. ఇది జులై తిరుగుబాటుగా మారింది. ఈ అల్లర్లలో 1,400 మంది వరకు మరణించారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం నివేదించింది. ఆందోళనల కారణంగా హసీనా అధికారం నుంచి వైదొలగి భారత్‌లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది.
తీవ్ర ఆరోపణలు.. మరణ శిక్ష
అనంతరం బంగ్లాలో మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఏర్పడ్డ మధ్యంతర ప్రభుత్వం ‘అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ICT)’ను పునరుద్ధరించింది. యుద్ధ నేరాలకు పాల్పడిన వారిని విచారించేందుకు ఆమే ఒకప్పుడు దీన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు అదే ట్రైబ్యునల్ 2024 నాటి అల్లర్ల విషయంలో హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాల ఆరోపణలు మోపింది. నెలల తరబడి విచారణ జరిపి సోమవారం మరణశిక్ష (Sheikh Hasina death sentence) విధించింది.
బంగ్లా భవిష్యత్తుపై మథనం
తన ఎదుగుదలకు తోడ్పడిన దేశమే ఇప్పుడు తన పతనాన్ని శాసించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు హసీనా. భారత ఆశ్రయంలో ఉంటూ సరిహద్దు ఆవల ఉన్న బంగ్లాదేశ్ భవిష్యత్తుపై మథనపడుతున్నారు. తనకు విధించిన మరణ శిక్షను ఖండించారు. తీర్పు మోసపూరితమన్నారు. అక్కడి ప్రభుత్వమే కుట్రపూరితంగా తనకు శిక్ష పడేలా చేసిందని ఆవేదన చెందారు. తనను తాను నిరూపించుకోవడానికి కోర్టు అవకాశం ఇవ్వలేదని వాపోయారు.
